Wednesday, July 25, 2012

సాగు నీటిని ఆదా చేద్దాం ఇలా



చల్లపల్లి, న్యూస్‌లైన్: ఉపరితల ఆవర్తనం... అల్పపీడనం... చురుకుగా కదులుతున్న రుతుపవనాలు... వీటన్నింటి కారణంగా మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ చాలా చోట్ల నేటికీ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టూ సగం కూడా నిండలేదు.

అంతెందుకు? చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలు కూడా నిండలేదు. భూగర్భ జల మట్టాలు పెరిగిన సూచనలూ కన్పించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరి పండించే రైతులు కొన్ని ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు అనుసరిస్తే నీటిని, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని, ఖర్చు కూడా కలిసొస్తుందని కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి.రమణ సూచిస్తున్నారు. ఆ వివరాలు...

స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలి
నెల రోజుల క్రితమే వరి నారుమడులు పోయాల్సి ఉన్నప్పటికీ సాగు నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్ధితుల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నారుమడులు పోయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ కాలపరిమితి కలిగిన రకాల్ని ఎంపిక చేసుకుంటే సమయం కలిసొస్తుంది. అంతేకాక వరి కోసిన తర్వాత పెసర, మినుము వంటి పంటల్ని సకాలంలో విత్తుకోవచ్చు. వరి పండించే రైతులు యంటీయూ-1010 (పంటకాలం 125 రోజులు), యంటీయూ-1001 (135 రోజులు), బీపీటీ-5204 (140 రోజులు), జేజీయల్-3855 (130 రోజులు), జేజీయల్-11475 (135 రోజులు) వంటి రకాల్ని ఎంపిక చేసుకోవడం మంచిది.

శ్రీ పద్ధతిలో మార్పులు చేసి...
శ్రీ వరి సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో దానిలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎస్‌ఎమ్‌ఎస్‌ఆర్‌ఐ పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో నారుమడులు పోయకుండానే నేరుగా డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు విత్తుకోవచ్చు. సమస్యాత్మక నేలలు తప్ప మిగిలిన అన్ని భూముల్లోనూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఎకరానికి సన్న రకాలైతే 15 కిలోలు, దొడ్డు రకాలైతే 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనశుద్ధి కోసం లీటరు నీటిలో ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాల్ని 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు మండె కట్టాలి.

విత్తనాలు విత్తే ముందు పొలాన్ని బాగా దున్ని చదును చేయాలి. పొలంలో నీరు లేకుండా బురద పదును ఉండేలా చూడాలి. ఆ తర్వాత విత్తనాల్ని డ్రమ్‌సీడర్‌లో పోయాలి. సీడర్‌లో నాలుగు డ్రమ్ములు ఉంటాయి. ఒక్కో డ్రమ్ముకు రెండు వైపులా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిలో మూడో వంతు వరకూ ముక్కు పగిలిన విత్తనాలు నింపి, మూత బిగించాలి. వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5-8 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే నారుమడులు పోసి ఉంటే 18-20 రోజుల సమయంలో ప్రధాన పొలంలో వరుసలు, మొక్కల మధ్య పైన తెలిపిన విధంగా దూరాన్ని పాటిస్తూ మొక్కలు నాటాలి.

ఆరుతడి పద్ధతిలో...
ఆరుతడి పద్ధతిలో వరి పండించే రైతులు ముందుగా పొలాన్ని దుక్కి చేయాలి. దున్నే సమయంలోనే పశువుల ఎరువుతో పాటు సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం ఎరువును వేయాలి. సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్ ఎరువుల్లో సగం మోతాదును కూడా వేసుకోవాలి. ఎకరానికి 12 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. నాగలి సాళ్లు వేసుకొని, వాటి వెంట విత్తనాలు చల్లాలి. విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేసుకునేందుకు సీడ్-కమ్-ఫర్టి డ్రిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు చల్లిన తర్వాత పలచగా నీరు పెట్టాలి.

యంత్రంతో నాట్లు
ప్రస్తుతం వరి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. దీనిని అధిగమించడానికి వరి నాటే యంత్రం ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో వరిని సాగు చేయాలంటే ఎకరానికి 12 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ముందుగా పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్లాస్టిక్ షీటు పరవాలి. దానిపై 2-3 సెంటీమీటర్ల మందాన సారవంతమైన మట్టిని సమానంగా వేయాలి. దానిపై కొద్దిగా వర్మి కంపోస్ట్ లేదా బాగా చివికిన మెత్తని పశువుల ఎరువు చల్లాలి.

అనంతరం మట్టిని బాగా చదును చేసుకోవాలి. ముందే సిద్ధం చేసుకున్న మొలకెత్తిన విత్తనాల్ని ఆ మట్టిపై చల్లి దాని పైన వరిగడ్డి పరవాలి. ఐదు రోజుల తర్వాత గడ్డిని తీసేయాలి. ప్రతి రోజూ నీరు చల్లుతూ ఉండాలి. 14 నుంచి 17 రోజుల మధ్య నారు సిద్ధమవుతుంది. నాట్లు వేసే ముందు యంత్రంలో అమర్చేందుకు వీలుగా ప్లాస్టిక్ షీటును ముక్కలుగా కత్తిరించాలి. పొలాన్ని బాగా దమ్ము చేసి, చదును చేసిన తర్వాత పలచగా నీరు ఉంచి యంత్రం సాయంతో మొక్కలు నాటాలి. ఈ యంత్రంతో నాటితే మొక్కల మధ్య 12 నుంచి 21 సెంటీమీటర్ల దూరం ఉంటుంది.

ఈ పద్ధతుల్లో వరిని సాగు చేసే వారు చిరుపొట్ట దశ వరకూ ఆరుతడి విధానంలో నీరు పెట్టాలి. పొట్ట దశ నుంచి కోతకు 10 రోజుల ముందు వరకూ పొలంలో రెండు సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి.

ప్రయోజనాలివే
ఎస్‌ఎమ్‌ఎస్‌ఆర్‌ఐ పద్ధతిలోనూ, ఆరుతడి పద్ధతిలోనూ, యంత్రం ద్వారా నాట్లు వేసే పద్ధతిలోనూ వరి సాగు చేస్తే నారుమడి పెంపకం కోసం ఎకరానికి పెట్టే మూడు వేల రూపాయల ఖర్చు తగ్గుతుంది. నీరు కూడా 30 శాతం వరకూ ఆదా అవుతుంది. కూలీల కొరతను అధిగమించవచ్చు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే 7-10 రోజుల ముందే పంట కోతకు వస్తుంది. 

No comments:

Post a Comment