Friday, July 27, 2012

రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన


రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన

slut-walk-delhi-“ఆవిడే కోరి వెళ్ళింది”
“అంతా డబ్బు కోసమే”
“ఇదో వ్యాపారం అయ్యింది”
“ఎక్కువసార్లు అంగీకారంతోనే జరుగుతాయి”
రేప్ బాధితులపైన ఢిల్లీ పోలీసు అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ఢిల్లీ ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (నేషనల్ కేపిటల్ రీజియన్ – ఎన్.సి.ఆర్) పరిధిలో గల పోలీసు ఠాణాల్లో ఉన్న అధికారులకు రేప్ బాధితుల పట్ల ఇలాంటి గొప్ప అభిప్రాయాలు ఉన్నాయి. రీసర్చ్ స్కాలర్లుగా చెప్పుకుంటూ తెహెల్కా విలేఖరులు జరిపిన ‘ఆపరేషన్’ లో ఈ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అభివృద్ధి చెందుతున్న సున్నిత సామాజిక విలువలను ఎప్పటికప్పుడు వంట బట్టించుకోవాల్సిన రాజధాని పోలీసులు, శతాబ్దాల నాటి అభివృద్ధి నిరోధక ఫ్యూడల్ భావాలతో రేప్ బాధితులతో శత్రుపూరితంగా వ్యవహరిస్తున్నారని తెహల్కా పరిశోధనలో తేలింది. రేప్ కేపిటల్ గా మారిన ఢిల్లీలో రేప్ నేరస్ధులపైన మూడొంతులు మాత్రమే నేరాలు రుజువు కావడానికి కారణం ప్రధానంగా పోలీసులేనని తేలింది.
నెల క్రితం ఒక మైనర్ బాలిక కదులుతున్న కారులో సామూహిక మానభంగానికి గురయింది. బాలిక ఐడెంటిఫికేషన్ ని వెల్లడించడం ద్వారా నోయిడా పోలీసులు అప్రతిష్ట పాలయ్యారు. ఐ.పి.సి సెక్షన్ 228-ఎ ప్రకారం రేప్ బాధితుల ఐ.డి ని వెల్లడించకూడదు. వెల్లడిస్తే రెండేళ్ల వరకూ ఖైదు విధించబడుతుంది. ఇదేమీ నోయిడా పోలీసులని అడ్డుకోలేదు. అంతే కాకుండా నోయిడా ఎస్.పి ఈ కేసులోని బాలిక క్యారెక్టర్ పైన విలేఖరుల సమావేశంలోనే అనుమానాలు వ్యక్తం చేసి పౌర సమాజాన్ని మరింత ఆగ్రహానికి గురి చేశాడు. అంతటితో ఆగకుండా గుర్ గావ్ పోలీసులు రాత్రి ఎనిమిది దాటాక వర్కింగ్ వుమెన్ సిటీలో తిరగకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించారు. ఎనిమిది దాటాక బైటికి రావాలంటే లేబర్ డిపార్ట్ మెట్ పర్మిషన్ తీసుకోవాలని వారు ప్రతిపాదించారు. స్త్రీలని బైటికి రాకుండా చేసి రేప్ లు నిరోధించాలన్నది వారి ప్రతిపాదన. పోలీసులు సమర్ధవంతంగా విచారణ చేస్తారనీ, శిక్షలు ఖాయమనీ పేరు సంపాదించగలిగితే రేప్ నేరాలు జరగడానికి తక్కువ అవకాశాలు ఉండవచ్చు. దానికి బదులు మహిళల కదలికలపైనే నిషేధం విధించడానికి పోలీసులు మక్కువ చూపారు.
రేప్ కేసులు పెరగడానికి కారణం మహిళలనేనని పోలీసు అధికారులు తడుముకోకుండా చెప్పారని తెహెల్కా తెలిపింది. మహిళల వస్త్ర ధారణ,Tehelka 01రాత్రి వేళల్లో బయట తిరగడం, పురుషులతో కలిసి పని చేయడం లాంటివల్ల రేప్ నేరాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల స్త్రీల పట్ల దారుణమైన అభిప్రాయాలని వీరు వ్యక్తం చేశారు. కార్మిక స్త్రీలపట్ల వీరి అభిప్రాయాలూ చాలా ఘోరమని తెహెల్కా కధనంలో వెల్లడయింది. అత్యాచారాలకి గురయిన అభాగినులు మొదట వచ్చేది ఎస్.ఐ/ఎస్.హెచ్.ఒ ల దగ్గరికే. వారికే ఇలాంటి అభిప్రాయాలు ఉన్నపుడు, బాధిత స్త్రీలపట్ల కనీస సానుభూతి లేనపుడు రేప్ నేరాల్లో సరయిన శాస్త్రీయ పరిశోధన జరిగడానికి అవకాశాలు ప్రాధమిక దశలోనే మూసుకుపోతాయి. ఇక నేరస్ధూలకి శిక్షలు పడడం దాదాపు అసాధ్యం. 2010 లో ఢిల్లీలో 414 కేసులు నమోదయితే అందులో 34.6 శాతం మందిపైనే నేరం రుజువయ్యింది. తప్పుల తడక ఎఫ్.ఐ.ఆర్ లు, బాధిత స్త్రీల నుండి సరిగ్గా సాక్ష్యాలను సేకరించకపోవడం, విచారణలో చిత్తశుద్ధి లేకపోవడం తదితర కారణాల వల్ల నేరస్ధులు నిర్దోషులుగా తప్పించుకుపోతున్నారు.
బాధిత స్త్రీలు పోలీసుల వద్దకు వచ్చేదే తక్కువ. (పోలీసు స్టేషన్లలో రిపోర్టయ్యే ప్రతి రేప్ కేసుకీ 50 కేసులు రిపోర్టు కాకుండా పోతున్నాయని ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ తెహెల్కా తెలిపింది) రిపోర్టు అవుతున్న కేసుల్లో కూడా 65 శాతం శిక్ష పడకపోవడం దారుణం. పోలీసు విచారణలో లోపాలను సరిదిద్దవలసిన అవసరం బాగా కనపడుతోంది. బాధిత స్త్రీకీ, పోలీసులకీ మధ్య ఉండవలసిన సున్నితమయిన నమ్మకంతో కూడిన సానుభూతి సంబంధం పోలీసుల సాంస్కృతిక వెనుకబాటుతనం వల్ల ఛిద్రం అవుతోంది. బాధిత స్త్రీలు మరింత చిత్రవధ కావడానికి కారణంగా నిలుస్తోంది. సమర్ధవంతమైన చట్టాలు ఉన్నప్పటికీ అవి పోలీసుల వెనుకబాటుతనం వల్ల ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.
తెహెల్కా విలేఖరులు రెండు వారాల పాటు పరిశోధన నిర్వహించారు. 23 స్టేషన్లు సందర్శించారు. 30 మందికి పైగా పోలీసు అధికారులతో మాట్లాడారు. వారిలో చాలామందికి 20-30 సంవత్సరాల సర్వీసు ఉన్నది. వీరంతా ఎన్.సి.ఆర్ పరిధిలోనివాళ్ళే. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. లక్షల మంది స్త్రీలు పురుషులతో కలిసి ఇక్కడ మూడు షిఫ్టుల్లో పని చేస్తుంటారు. తమ పరిశోధనలో మహిళల పట్ల వ్యతిరేక అభిప్రాయాలూ వ్యక్తం చేయలేదని విలేఖరులు తెలిపారు. మామూలు అభిప్రాయాలని వదిలి Tehelka 02మహిళలపై చీప్ అభిప్రాయాలూ చెప్పేందుకు ప్రోత్సహించేలా మాట్లాడలేదని చెప్పారు. నిస్పాక్షికంగా అభిప్రాయాలూ సేకరించామని చెప్పారు. అయినప్పటికీ షాకింగ్ కి గురి చేసే అభిప్రాయాలూ విన్నామని తెలిపారు.
గుర్ గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లోని డజనుపైన పోలీసు స్టేషనలోని 17 సీనియర్ పోలీసు అధికారులు స్పై కెమెరాల ముందు మహిళల పట్ల దారుణ అభిప్రాయాలూ వ్యక్తం చేశారు. ఫ్యాషన్ దుస్తులే రేప్ లకి కారణం అన్నారు. కనిపించేలా డ్రస్ లు వేసుకుంటారన్నారు. బాయ్ ఫ్రెండ్స్ తో పబ్ లకి వస్తే రేప్ లు చేయరా అనడిగారు. తాగుతారని నిందించారు. మగాళ్లలతో కలిసి పని చేస్తే అంతే అన్నారు. ‘ప్రతిసారీ ఆడవాళ్ళదే తప్పు’ అన్నదే వారి మాటల్లోని సారాంశం. వారి దృష్టిలో నిజంగా రేప్ కి గురయినవారు పోలీసు స్టేషన్లకు రారు. పోలీసులకి వచ్చేవారు ప్రాధమికంగా డబ్బులు దండుకోవడానికేనన్నది వారి నిర్ధారణ. వారికి నైతిక విలువలు లేకపోతేనే పోలీసుల దగ్గరికి వస్తారట. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు బేసికల్ గా వ్యభిచారులట. వారిని బలవంతం చేయాల్సిన అవసరం లేదట. ఒక పురుషుడితో సెక్స్ కి అంగీకరించిన స్త్రీ అతని స్నేహితులు రేప్ చేస్తే ఫిర్యాదు చేయకూడదట. రాత్రి వేళ్ళల్లో పనికి సిద్ధమైనపుడు రేప్ లు సాధ్యమని తెలుసుకోవాలట.
పోలీసు అధికారులు చెప్పేదే నిజం అయితే రేప్ లకి చాలా అవకాశాలు ఉన్నాయి. కో-ఎడ్యుకేషన్ స్కూల్ లో చదవడం వల్ల జరగచ్చు. సిటీలకి వలస రావడం వల్ల జరగొచ్చు. స్త్రీలు స్వంతంత్రంగా వ్యవహరించడం వల్ల జరగొచ్చు. సాంప్రదాయ విరుద్ధమైన ఉద్యోగాలు చేయడం వల్ల జరగొచ్చు. ఇవన్నీ రేప్ నేరాలు పెరగడానికి కారణమే. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో బాధిత స్త్రీల పరిస్ధితి ఊహించలేము.
తూర్పు ఢిల్లీలోని ఘజియాపూర్ పోలీసు స్టేషన్ అధికారి (ఎస్.హెచ్.ఒ – స్టేషన్ హౌస్ ఆఫీసర్) సునీల్ కుమార్ ఇలా అన్నాడు “దక్షిణ ఢిల్లీలో పబ్ కి వెళ్లండి. గ్రేటర్ కైలాష్ కి వెళ్ళండి. అక్కడ అమ్మాయిలకి ఉచిత ప్రవేశం ఉంది. అక్కడ 1000 రూపాయలకి ఆ పని చేయడానికి అమ్మాయిలు సిద్ధం. వాళ్ళు తాగుతారు. సెక్స్ లో కూడా పాల్గొంటారు. ఎవడో ఒకడు బలవంతం చేసిన రోజున అది రేప్ అయిపోతుంది”. సూరజ్ పూర్ (గ్రేటర్ నోయిడా) స్టేషన్ ఎస్.హెచ్.ఒ అర్జున్ సింగ్ ఇలా అంటాడు. “అమ్మాయిలు తమ పరిమితుల్లో ఉండకపోతే, సరైన దుస్తులు వేసుకోకపోతే, అనివార్యంగా అక్కడ ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ మగాళ్లని దూకుడుగా మారుస్తుంది. ఇక వాళ్ళది చేసేస్తారు”
గుర్ గావ్, సెక్టార్ 29 అదనపు ఎస్.హెచ్.ఒ రాజ్పాల్ యాదవ్ “డార్జిలింగ్, నేపాల్ అమ్మాయిలు ఇక్కడికి వ్యాపారం కోసమే వస్తారు. డబ్బుకోసం మగాళ్లతో వెళ్తారు. తర్వాత డబ్బు సరిపోకపోతే ఆదిక రేప్ అవుతుంది” అన్నాడు. తాము మాట్లాడినా 30 మంది అధికారుల్లో 17 మంది రేప్ బాధితుల పట్ల మొరటు భావాలు వ్యక్తం చేస్తే ఐదుగురు అధికారులు సానుభీతిగా మాట్లాడారని తెహెల్కా తెలిపింది.
పదో తరగతి అబ్బాయిలు రేప్ కి పాల్పడినపుడు బాధిత స్త్రీపైన నోయిడా పోలీసులు నోరు పారేసుకున్నారు. అందుకు వారు తీవ్ర విమర్శలకిTehelka 03గురయ్యారు. అయినప్పటికీ వారు తమ అభిప్రాయాలూ మార్చుకోలేదు. ఈ కేసులో పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న నోయిడా పోలీసు అధికారి రామ్ కుమార్ మాలిక్ ఇలా అన్నాడు. “ఈ కేసులో అసలు విషయం ఏమిటంటే అమ్మాయికి వోడ్కా అలవాటుంది. వోడ్కా పార్టీ అడిగింది. ఆ తర్వాత సెక్స్ కి రు. 6000 అడిగింది. డబ్బు చెల్లించకపోవడంతో రేప్ కేసు పెట్టింది. ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ చూస్తే, నిందితుల్లో ఒకరితో సంబంధం ఉన్నట్లు వెళ్లడాయింది”. ఒక అబ్బాయితో అంగీకారంతో సెక్స్ లో పాల్గొంటే వాడి ఫ్రెండ్స్ రేప్ చెయ్యొచ్చని మాలిక్ అభిప్రాయం.
రామ్ కుమార్ మాలిక్ అమ్మాయితో ఆగలేదు. ఆమె తల్లిదండ్రులనీ, అమ్మాయి క్యారెక్టర్ నీ నిందించాడు. “ఆమె తల్లి విడాకులు తీసుకుంది. ఒక యాదవ వ్యక్తితో కలిసి ఉంటోంది. ఆమెకి 48 అయితే అతనికి 28. ఆమె ఇద్దరు కూతుళ్ళూ అలాగే తయారవుతారు కదా” అని నిందించాడు. “ఇప్పుడు 48 యేళ్ళ వాళ్ళ తల్లి యువకుడితో ఉన్నపుడు వాళ్ళు కూడా ప్రేరేపించబడతారు కదా. సెక్స్ ఆకలి లాంటిది” అని మాలిక్ అన్నాడు. విడాకులు తీసుకున్న స్త్రీల దీన పరిస్ధితిని ఇక్కడ చూడవలసి ఉంది. వివాహ వ్యవస్ధ పతనం తిరిగి స్త్రీలనే బలికోరుతోంది. దిగుమతి చేసుకున్న పాశ్చ్యాత్త విలువలు సైతం స్త్రీలను నైతిక చక్ర బంధంలో ఇరికిస్తున్నాయి. పాశ్చ్యాత్త విలువల్లోనూ పురుషులకు అంటని నైతికత, పాతివ్రత్యం విలువలు స్త్రీలని అంటి పెట్టుకుని కొనసాగుతున్నాయి.
23 యేళ్ళ పబ్ వర్కర్ రేప్ కేసును డి.ఎల్.ఎఫ్ ఫేస్-2 పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఒ జంగ్ షేర్ సింగ్ దర్యాప్తు చేస్తున్నాడు. ఆయన ఇలా అంటాడు “ఈ కేసులో ఏమీ లేదు. వాళ్ళు పిల్లలు. ‘రాజీ’ పడడానికి ఆ అమ్మాయి అబ్బాయిల్తో రెండు సార్లు మాట్లాడింది. అదంతా డబ్బు కోసమే. డబ్బుతోనే ఒప్పందాలు కుదురుతాయి”. గురు గావ్ రేప్ కేసులో పరస్పరం ఆమోదం ఉందని జగ్ షేర్ సింగ్ నిశ్చితాభిప్రాయం. “అమ్మాయిలు సహకరిస్తారండీ. సహకారం లేకపోవడం చాలా అరుదని నా అభిప్రాయం. ఈ కేసులో కూడా అమ్మాయి అంగీకారం ఉంది” అని అన్నాడు. ఈయన ధోరణి చూస్తే, రేప్ లకి అమ్మాయిలు సహకరించకపోతే అమ్మాయిలనే నేరస్దులుగా మార్చేలా ఉన్నాడు.
ఈ డి.ఎల్.ఎఫ్ రేప్ కేసు దర్యాప్తుతో సంబంధం లేని సెక్టార్-29 ఎస్.హెచ్.ఒ జగదీష్ ప్రసాద్ అభిప్రాయాన్ని కూడా తెహెల్కా రికార్డు చేసింది. ఆయన ఇలా అంటాడు “ఈ మధ్య జరిగిన డి.ఎ.ఎఫ్ కేసులో చూస్తే, అమ్మాయికి 27 సంవత్సరాలు. అబ్బాయిల వయసు 18-20 యేళ్ళు ఉంటాయి. వాళ్ళు పిల్లలు. బార్ లో వాళ్ళతో ఆ అమ్మాయి డాన్స్ చేస్తోంది. నేను చెబుతున్నా కదా ఆ అమ్మాయే వాళ్ళని రెచ్చగొట్టింది. అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చింది.” ఇండియాలో ప్రతి సంవత్సరం 25,000 రేప్ కేసులు రిపోర్టు కావడం లేదన్న సంగతిని ఇలాంటి పోలీసు అధికారులు నమ్ముతారో లేదోనని తెహెల్కా అనుమానం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసులే స్త్రీల సెన్సిబిలిటీస్ పట్ల సున్నితంగా లేకపోతే గ్రామీణ ప్రాంతాల పరిస్ధితిని ఏమిటని ప్రశ్నించింది.
Tehelka 04స్త్రీలు ధరించే దుస్తులు రేప్ లకి ముఖ్య కారణమని ఢిల్లీ పోలీసులు నమ్ముతున్నారు. సాంప్రదాయ బద్ధంగా దుస్తులు వేస్తుకున్న స్త్రీలు రేప్ లకి గురికారని వీరి నమ్మకం. దుస్తుల ధారణ సూచనాత్మకంగా ఉంటే వారిక సమస్యలని ఆహ్వానిస్తున్నట్లే. ఫరీదాబాద్ సెక్టార్ 31 ఎస్.హెచ్.ఒ సత్బీర్ సింగ్ ఇలా అంటాడు “అమ్మాయెవరైనా పారదర్శకంగా బట్టలు వేసుకుంటే పిల్లల్లో పోకిరీ ఆలోచనలు రావడానికి ప్రోత్సహించినట్లే. అమ్మాయిలు కురచ స్కర్టులు వేసుకుంటారు. ఊహించడానికి కూడా ఏమీ లేకుండా బ్లౌజులు ధరిస్తారు. దుపట్టాలు వేసుకోరు. శరీరాల్ని ప్రదర్శిస్తారు. పిలగాళ్ళు సహజంగానే వారి పట్ల ఆకర్షితులవుతారు కదా”. ఇదే అంశాన్ని సూరజ్ పూర్ ఎస్.ఐ అర్జున్ సింగ్ ఇలా అంటున్నాడు “అమ్మాయిలు ఎలా డ్రస్ వేసుకుంటారంటే, జనం ఆమె పట్ల ఆకర్షించబడడం ఖాయం. నిజానికి అమ్మాయే వాళ్ళని తనని ఏదో చేయాలని కోరుతుతోందన్నమాట.” ఈ లెక్కన అసలు రేప్ లు జరుగుతున్నాయాని? ఈ అనుమానం పోలీసులదే. నిజమైన రేప్ లు అరుదని పోలీసు అధికారుల నిశ్చితాభిప్రాయం.
కురచ దుస్తులు వెర్రి తలలు వేస్తున్న ఫ్యాషన్ల ఫలితం. పశ్చిమ దేశాల వెర్రి సంస్కృతిని మక్కీకి మక్కీ కాపీ కొడుతున్న ఫలితం. ఈ సంస్కృతీ పరాధీనతను సవరించడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసి ఉండగా అదేమీ జరగడం లేదు. కానీ అమ్మాయిల కురచ దుస్తుల వల్ల మగాళ్లు నీతి తప్పాలా అన్న ప్రశ్న పోలీసు అధికారులు వేయకపోవడమే విచిత్రం. అదీ కాక రేప్ గణాంకాలు చూస్తే తొంభై శాతం పైన దగ్గరి సంబంధీకులే దోషులుగా ఉన్నారని ఢిల్లీ లెక్కలే చెబుతున్నాయి. నేరాలకు గల సామాజిక కారణాలను లోతుగా పరిశీలించలేని పోలీసుల అశక్తత స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు సైతం సామాజిక సర్వేలను తమ నేర పరిశోధనకు అన్వయించలేని దుస్ధితి నెలకొని ఉంది. చక్కగా దుస్తులు వేసుకుని బైటికి రావాలని ఎ.పి డి.జి.పి సూచనలు చేయడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
రేప్ బాధితులు పోలీసు స్టేషన్లకి రావడం తేలికా, కష్టమా? కష్టమేనని నోయిడా, సెక్టార్ 39 అధికారి యోగేందర్ సింగ్ అంటున్నాడు “బాధిత స్త్రీకి పోలీసు స్టేషన్ కి రావడం ఎప్పుడూ తేలిక కాదు. తర్వాత ఎదురయ్యే ఇబ్బందికి అందరూ దడుస్తారు. మీడియా అన్నా సమాజం అన్నా భయపడతారు. నిజం చెప్పాలంటే రేప్ లని వ్యాపారం గా మార్చుకున్నవారే పోలీసుల దగ్గర ఫిర్యాదు చేస్తారు.” అదీ సంగతి. ఈ అభిప్రాయం ఉన్న అధికారి దర్యాప్తు నిష్పాక్షికంగా ఎందుకు చేస్తాడు? గుర్ గావ్ సెక్టార్ 40 ఎస్.ఐ రూప్ లాల్ “కేవలం పది శాతం కేసుల్లోనే నిజంగా రేప్ జరిగి ఉంటుంది. 10 శాతం మాత్రమే నిజాయితీగా ఫిర్యాదు చేస్తారు. మిగిలినవన్నీ…” అంటూ ఆర్ధోక్తిలో ఆపేశాడు. ఆయన అభిప్రాయం స్పష్టమే. ఓల్డ్ ఫరీదా బాద్ పోలీసు స్టేషన్ అధికారి రాజేందర్ సింగ్ ఈ అభిప్రాయాన్ని  ధ్రువపరిచాడు. “70 శాతం కేసుల్లో పరస్పర అంగీకారం ఉంటుంది. ఎవరైనా చూస్తేనో, డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతేనో, అవి రేప్ కేసులుగా మారుతాయి” అని ఆయన అన్నాడు.
నోయిడా సెక్టార్ 24 స్టేషన్ లోని యువ అధికారి మనోజ్ రావత్ ఇలా అన్నాడు “అసలు ఎన్.సి.ఆర్ లో రేప్ లు జరుగుతున్నాయా? పేపర్లుTehelka 05చెప్పేది కాకుండా నిజాల కోసం చూడండి. ఎన్.సి.ఆర్ లో ప్రతీదీ పరస్పర అంగీకారంతో జరుగుతున్నదే. నా వ్యక్తిగత అభిప్రాయ ఏమిటంటే ఒకటి లేదా రెండు శాతం మాత్రమే నిజంగా జరిగినవి. అవగాహన కూలిపోతే ఇక ఎగ్జాగరేషన్ మొదలవుతుంది. రెండు మూడవుతాయి.” 
గ్యాంగ్ రేపుల్లో పోలీసుల అభిప్రాయాలూ ఇంకా దారుణం. ఘజియాబాద్ లో ఇందిరాపురం  పోలీసు స్టేషన్ అధికారి ధరంవీర్ సింగ్ “పది మంది అబ్బాయిలు బలవంతంగా ఒక అమ్మాయిని ఎత్తుకురావడం చాలా అరుదు. అబ్బాయిలు ఉన్న కారులోకి ఎక్కే అమ్మాయి అమాయకురాలు కానే కాదు. ఎక్కితే గనక వాళ్ళలో ఒక అబ్బాయితోనైనా సంబంధం ఉన్నట్లే” అన్నాడు. ఒకరితో సంబంధం ఉంటే ఇంకో పది మంది రేప్ చేయడం సహజమే కదా అన్నది ధర్మ్ వీర్ నిర్ధారణ. గుర్ గావ్ సెక్టార్ 40 అధికారి రూప్ లాల్ ఇలా అంటున్నాడు. “ఇప్పుడు మనం కూర్చున్నాం. కదులుతుండగా అందరికీ ఒక్కటే డ్రింకు. అదిక జరిగి తీరుతుంది. అమ్మాయిని రాత్రంతా ఉంచుకోవాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏమని చెప్పాలి? ఒక గంట మాత్రమే బైటికి వెళ్ల్లివస్తానని చెప్పిన అమ్మాయి రాత్రంతా ఉండిపోయింది. తల్లిదంద్రులు ప్రశ్నిస్తారు. అన్నయ్య కూడా అడుగుతాడు. సమాజం ప్రశ్నిస్తుంది” అని అన్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్యా, సమాజం వేసే ప్రశ్నలకి బదులు చెప్పలేక రేప్ నేరం మోపుతుందని రూప్ లాల్ నిర్ధారించేశాడు.
అయితే, నోయిడా సెక్టార్ 20 అధికారి ఆర్.కె.సిసోడియా ఒక్కరే పూర్తి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెహెల్కా తెలిపింది. ఆయన ప్రకారం ఎన్.సి.ఆర్ లో చాలా తక్కువ కేసుల్లో మాత్రమే తప్పుడు ఫిర్యాదులు ఉన్నాయని  తెలిపాడు. ఆయన చెప్పింది విని తెహెల్కా విలేఖరులు ఆశ్చర్యపోయామని తెలిపారు.
ఇన్స్ పెక్టర్ సునీల్ కుమార్ అయితే అమ్మాయిల స్వభావాన్ని స్కెచ్ గీసి చెప్పాడు. ముఖ్యంగా ఢిల్లీ అమ్మాయిలంటే ఆయనకి మహా చీప్. “ఢిల్లీ అమ్మాయి ఈ వేదన వద్దనుకుంటే అసలు ప్రోత్సహించదు. మీరిద్దరూ ఉన్నారు. నేనొక అమ్మాయిని. మీ ఇద్దరితో డేటింగ్ చేస్తున్నా. ఒకరితో ఫ్లిర్టింగ్ చేస్తూ ఇంకొకరిని పట్టించుకోవడం లేదనుకోండి. అప్పుడు అతను అసూయగా ఉండడం చూసి మీ దగ్గరికే వస్తాను. ఓ రోజున అతను తాగి వస్తాడు. ఇంకో ముగ్గురు స్నేహితుల్ని కూడా తేవచ్చు. అతను నాతో సెక్స్ కి ప్రయత్నిస్తాడు. నేను ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా పట్టించుకోడు. అది నా తప్పు. ఎందుకంటే నేనే వినాశనాన్ని ఆహ్వానించాను. చూడండి. అమ్మాయి రెచ్చగొట్టకపోతే… ఢిల్లీలో అసలు రేపే జరగదు” అని ఆయన తేల్చేశాడు. వీరి ప్రకారం చీర కట్టుకున్న స్త్రీలు, సల్వార్ కమీజ్ ధరించిన స్త్రీలు అసలు రేప్ కి గురికారు. కానీ గణాంకాలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.
Tehelka 06హద్దులు మీరుతున్న డేటింగ్ కల్చర్ లో పోలీసులకి తప్పు కనపడకపోవడం విచిత్రం. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడడం, ప్రేమించుకోవడం, దగ్గరవడం అన్నీ ఒక్కటే అన్న అవగాహన నెలకొని ఉండడం ఒక సమస్య. ఇరువురి మధ్య ప్రేమ సంబంధం అభివృద్ధి చెందడంలో సంభవించే వివిధ సున్నిత దశలను ఒకదానికొకటి విభజించుకోవడంలో యువతీ యువకులు విఫలం అవుతున్నారు. ఆ విషయంలో చైతన్యవంతమైన అవగాహన కలిగించడంలో సమాజం సఫలం కావడం లేదు. సమాజమే వెనుకబాటు భావాలు కలిగి ఉన్నపుడు స్త్రీ, పురుషు సంబంధాలలోని సున్నితాంశాలు యువకులకు సరిగ్గా అర్ధం కావడం సులభమైన విషయం కాదు. సమాజం పరివర్తనా దశలో ఉన్నపుడు ప్రభుత్వాలు, నిర్దేశక వ్యవస్ధలను సమర్ధవంతంగా నిర్వహించగలగాలి. లేనట్లయితే యువతీ, యువకుల్లో ఏర్పడే అనేక సందేహాలు పరిష్కారానికి నోచుకోక అయోమయంలో అనేక తప్పటడుగులు వేస్తారు. ఈ పరిస్ధితిని గుర్తించడానికి బదులు మొత్తంగా అమ్మాయిల ప్రవర్తనలని తప్పు పడుతూ రేప్ నేరాలకి వారినే బాధ్యులని చేయడం అసంగతం.
ఇలాంటిదే మరొక సినేరియోను రూప్ లాల్ విలేఖరుల ముందుంచాడు. “ఒకమ్మాయి పుట్టినరోజు పార్టీ కోసం అడిగినప్పుడు, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో ఒంటరిగా ఉన్నపుడు, వాళ్ళు తాగుతున్నపుడు, ఇక ఏంజరగనుందో ఆ అమ్మాయికి తెలుస్తుంది. ఆ అమ్మాయే స్వయంగా అలాంటి పార్టీకి వెళ్ళినపుడు మానభంగం జరిగిందని ఎలా ఫిర్యాదు చేయగలుగుతుంది? వాళ్ళతో కూర్చుని కలిసి తాగుతున్నపుడు దాన్ని రేప్ అని ఎలా చెబుతుంది? నువ్వు విద్యార్ధినివి. నీకంటూ సొంత బుర్ర ఉంది కదా. వాళ్ళతో కలిసి బైటికి ఎందుకు వెళ్తున్నావు?” అని అడిగాడు. అబ్బాయిలతో కలిసి తాగినా, పార్టీకి వెళ్ళినా రేప్ జరుగుతుందని రూప్ లాల్ నిర్ధారిస్తున్నాడు. అది సహజమని కూడా చెబుతున్నాడు. రేప్ తప్ప మరోక సంబంధం పార్టీలో ఉన్న అమ్మాయి, అబ్బాయిల మధ్య నెలకొనబోదని నమ్ముతున్నాడు. శారీరక సంబంధం కాకుండా ఇతరేతర సంబంధాలేవీ అమ్మాయి, అబ్బాయిల మధ్య ఉండడం అసంభవమని నమ్ముతున్నాడు. వివిధ మానసిక దశలు, సంబంధాల మధ్య ఉండే విభజన రేఖలని ఆయన ఒక్క స్టేట్ మెంట్ తో చెరిపేశాడు.
ఇంకా ఇలాంటి ప్రేలాపనలను తెహెల్కా రికార్డు చేసింది. ఈ రిపోర్టును ఎన్.డి.టి.వి ప్రచురించింది.

No comments:

Post a Comment