Wednesday, July 25, 2012

నాడు విజేత... నేడు కూలీ

పుదుకోట్టై: దోహా ఆసియా క్రీడలు (2006)... 800మీ. విభాగంలో రజతం సాధించిన శాంతి సౌందరరాజన్ ఒక్కసారిగా దేశవ్యాప్త గుర్తింపును సాధించి వార్తల్లోకెక్కింది. ఎటు చూసినా అభినందనలు... గౌరవంతో పాటు తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి రూ.15 లక్షల ఆర్థిక సహాయం పొందింది. కటిక పేదరికం నుంచి తన జీవితం ఇక దారిలో పడినట్టే అనుకున్న తరుణంలో పిడుగులాంటి వార్త. శాంతి మహిళ కాదనే ఆరోపణలతో పరిస్థితి అంతా తారుమారైంది. లింగ నిర్ధారణ పరీక్షలోనూ శాంతి విఫలం కావడంతో ఆమె సాధించిన రజతాన్ని వెనక్కితీసుకున్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య జీవిత కాలం బహిష్కరణ విధించగా రాష్ట్ర అధికారులు ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా జీవితం కడు దుర్భరంగా మారింది. శాంతి ఇప్పుడు రోజువారీ కూలీగా బతుకును వెళ్లదీయాల్సి వస్తోంది. 
రోజుకు రూ.200 కోసం ఓ ఇటుక బట్టీలో చేతులు బొబ్బలెక్కేలా పని చేస్తోంది. ‘నా విషయంలో జరిగిన పరిణామాల వల్ల తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. అంతా గత చరిత్రలా మిగిలిపోయింది. ఇప్పటిదాకా నేను సాధించిన రికార్డులన్నీ చెరిపేశారు. మైదానంలో ఉండాల్సిన నేను ఉపాధి కోసం రోజుకు రూ. 200 కూలీ కోసం ఇటుక బట్టీలో పనిచేస్తున్నాను. జీతం తక్కువగా వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాను. అదీకాకుండా అది కాంట్రాక్ట్ పద్దతిన ఉండేది. రెగ్యులరైజ్ చేయమంటే పట్టించుకోలేదు. అందుకే మరో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను’ అని శాంతి తెలిపింది. ఆమె శిక్షణలో రాటుదేలిన అథ్లెట్లు జాతీయ మీట్స్‌లో పతకాలు సాధించారు.
ఆమె ఆరోపణలు అర్ధరహితం: అధికారులు
తమిళనాడు ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదనే శాంతి ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైనా శాంతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపిందని క్రీడల అదనపు ముఖ్య కార్యదర్శి జీఏ రాజ్‌కుమార్ తెలిపారు.

No comments:

Post a Comment