Wednesday, July 25, 2012

ప్రథమ పౌరుడి ప్రమాణం

దేశ అత్యున్నత పీఠంపై ప్రణబ్‌ ముఖర్జీ అశీనులయ్యారు. దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన రాజ్యాంగ అధిపతిగా రాజ్యాంగము, చట్టాన్ని పరిరక్షించేందుకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్లమెంట్‌ సెంట్రల్‌లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ హెచ్ కపాడియా బుధవారం ఉదయం ప్రణబ్‌తో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రణబ్‌ ఇంగ్లిష్‌లో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ప్రణబ్‌ ప్రమాణస్వీకారానికి రాజకీయ ఉద్దండులు విచ్చేశారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ , యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఉప రాష్ట్రపతి హామీద్‌ అన్సారీ, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేత అద్వానీ, పార్లమెంట్‌లో విపక్ష నేతలు సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, అనేక రాష్ట్రాల గవర్నరులు, యూపీఏ భాగస్వామ్య పక్షాలు ప్రణబ్‌ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. 
ఎక్కువ మందికి పదవులు వన్నె తెస్తాయి. చాలా తక్కువ మంది మాత్రం పదవులకే వన్నె తెస్తారు. అలాంటి అరుదైన రాజకీయ నేత ప్రణబ్ ముఖర్జీ. కేంద్రమంత్రి వర్గంలోని అన్ని కీలక మంత్రి పదవులనూ అలవోకగా నిర్వర్తించిన రాజకీయ ఉద్ధండుడు ముఖర్జీ. ఆయన జీవితమే ఓ మేధో ప్రస్థానం.
కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా దేశంలోనే అత్యంత గౌరవ ప్రదమైన రాజకీయ నాయకుడిగా పేరొందిన నేతప్రణబ్ ముఖర్జీ. నాలుగు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ రూటే సెపరేటు.పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బీర్బం జిల్లాలోని మిరాటి గ్రామంలో 1935 డిసెంబర్‌ 11న బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్‌ జన్మించారు. ఆయన తండ్రి కామద కింకర్‌ ముఖర్జీ కూడా కాంగ్రెస్‌ పార్టీలో అనేక కీలక హోదాల్లో పనిచేశారు.
ప్రణబ్‌ కలకత్తా యూనివర్శిటీ నుంచి చరిత్ర, రాజనీతిశాస్త్రంలో ఎమ్మేతోపాటు న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు. కొద్దిరోజులపాటు న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగా పనిచేసిన ఈ బెంగాలీ బాబు తర్వాత రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో సువ్రా ముఖర్జీతో వివాహం జరిగింది. ముఖర్జీ దంపతులకు ఇద్దరు కుమారులు.. ఇంద్రజిత్‌, అభిజిత్‌, కూతురు శర్మిష్ట ఉన్నారు. 
43 ఏళ్ల క్రితం ఎంపీ, 39 ఏళ్ల క్రితమే మంత్రి అయిన ప్రణబ్‌...నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. 1969 లో మొట్ట మొదటి సారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రణబ్. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. 1973లో ఆయన కేంద్ర కేబినెట్ లో అడుగుపెట్టారు. 
పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించారు. ఇక అప్పటినుంచీ ఇప్పటి వరకు ఆయన కేబినెట్ లోని అన్ని కీలక మంత్రిత్వ శాఖల్లోనూ సమర్ధవంతంగా పనిచేశారు. సోనియా గాంధీ రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా..ప్రణబ్ మాత్రం సోనియాకు పూర్తిగా అండగా నిలిచారు.
జీవితాంతం రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చిన ప్రణబ్ మొట్టమొదటి సారిగా లోక్ సభకు ఎన్నిక కావడంతో..రాజ్యసభ సభ్యుడైన మన్మోహన్ ప్రధాని కాగానే...ప్రణబ్ లోక్ సభలో పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ప్రధాని అయ్యేందుకు అన్ని విధాల అర్హతలున్న ప్రణబ్ రెండు సార్లు ప్రధాని పీఠం దాకా వచ్చినా అందులో కూర్చోలేకపోయారు. అయితేనేమీ ఇపుడిక రాష్ట్రపతి పదవికి ప్రణబ్ వన్నె తేనున్నారు

No comments:

Post a Comment