Tuesday, July 24, 2012

'ఆహార భద్రత' కాదది..


  • 'నగదు బదిలీ'పై రౌండ్‌టేబుల్‌లో వక్తలు
  • ప్రజలకు, ప్రజా హక్కులకూ వ్యతిరేకం
  • పిడిఎస్‌ను నిర్వీర్యం చేసే దురుద్దేశం
  • దీర్ఘకాలిక ఉద్యమాన్ని రూపొందించాలని పిలుపు
దేశ ప్రజానీకానికి ఆహార భద్రతను కల్పించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయని పలువురు వక్తలు విమర్శించారు. పేదలను ఆకలితో అలమటింపజేసే వంచన, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దురుద్ధేశ్యాలు ఆ పథకం వెనుక దాగున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు, వారికి ఆహారాన్ని అందించాలన్న రాజ్యాంగ హక్కుకూ పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఈ పథకాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఒక దీర్ఘకాలిక ఉద్యమాన్ని రూపొందించాలని ప్రజా సంఘాలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, పట్టణ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యాన 'నగదు బదిలీ పథకం-పర్యవసానాలు' అనే అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు టి జ్యోతి, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, పట్టణ పౌర సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పివి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నగదు బదిలీ పథకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వివిధ ప్రజా సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాల నాయకులు పలుమార్లు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవటం శోచనీయమని అన్నారు. అందువల్ల నగదు బదిలీ పధకానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. జిల్లాల్లో ఉమ్మడిగా కరపత్రాలువేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఐఎఎస్‌ అధికారి కెఆర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ సబ్సిడీ రూపంలో ప్రజలకు అందించే రేషన్‌ సరుకులు, ఇతర పథకాలకు నగదు బదిలీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం అత్యంత శోచనీయమన్నారు. ప్రస్తుతం పరిమాణం (క్వాంటిటీ) ధర (ప్రైస్‌) ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఆహార పదార్థాలు, ఇతర సరుకులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. నగదు బదిలీని ప్రవేశపెడితే ఈ రెంటికీ అన్యాయం జరుగుతుందని తెలిపారు. గతంలో అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డు కీలకమని, అసలు ఆ కార్డే బీదల కార్డు అంటూ బాకాలు ఊదరగొట్టిన పాలకులు, ఇప్పుడు మళ్లీ నగదు బదిలీ అంటూ కొత్త పాట అందుకోవటంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. నగదు బదిలీ పథకానికి సంబంధించిన విధి విధానాల్లో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితరాంశాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టి, నగదు అంశం ప్రస్తావనే లేకుండా చేస్తే ఇప్పుడు ఆహార పదార్థాలు కాకుండా నగదును బదిలీ చేస్తామంటూ పాలకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పుడూ, ఇప్పుడూ పేదలకు నష్టదాయకమైన చర్యలకే పాల్పడటం పాలకులకు ఆనవాయితీగా మారిందని విమర్శించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు మాట్లాడుతూ నగదు బదిలీ పథకాన్ని కొన్ని పార్టీలు, సంస్థలు, ఎన్జీవోలు సమర్థిస్తున్నాయని చెప్పారు. ఇదే సందర్భంలో అత్యధిక పార్టీలు, సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెచ్చరిల్లిన అవినీతిని రూపుమాపేందుకే నగదు బదిలీని ప్రవేశపెడుతున్నామంటూ ప్రభుత్వం వాదించటం విడ్డూరంగా ఉందన్నారు. అయితే నగదు బదిలీ పథకంలో కూడా అవినీతిని జొప్పించే నిష్ణాతులున్నారని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే స్కాలర్‌షిప్పులు, పింఛన్ల చెల్లింపులు, ఉపాధి పనుల వేతనాల చెల్లింపు తదితరాల్లో కూడా అవినీతి జరుగుతోందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతమున్న రేషన్‌ విధానం ద్వారా సరుకుల దుబారా, దుర్వినియోగం జరుగుతోంది కాబట్టి వాటిని నగదు బదిలీ పథకం ద్వారా అరికడతామంటూ చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ పధకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రేషన్‌ షాపుల ఆవసరం లేదంటూ చౌక ధరల దుకాణాలను, వాటిని తీసేస్తున్నాం కాబట్టి ఎఫ్‌సిఐ గోదాములను క్రమక్రమంగా ఎత్తేస్తారని హెచ్చరించారు. ఆ తర్వాత ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరల గురించి రైతులు, రైతు సంఘాలు గొంతెత్తి అరిచినా ఫలితం ఉండబోదని చెప్పారు. ఫలితంగా మార్కెట్‌రంగంలోకి బహుళజాతి కంపెనీల ప్రవేశం సులభమవుతుందని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో నగదు బదిలీ పధకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ దీర్ఘకాలిక ఉద్యమాన్ని రూపొందించాలని రాఘవులు సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంనర్సింహారావు మాట్లాడుతూ పిడిఎస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయటానికే ప్రభుత్వం నగదు బదిలీ పధకానికి శ్రీకారం చుడుతోందని అన్నారు. సంక్షేమ పథకాలను కుదించాలి, సబ్సిడీలు ఎత్తేయాలన్న ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగానే ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు, మందులను రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. ఇదే తరహా పథకాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
లోక్‌సత్తా నాయకులు లక్ష్మన్‌బాలాజీ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ఆ తర్వాత వాటిని ఎత్తేయటం పాలకులకు ఆనవాయితీగా మారిందన్నారు. ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమ పధకాలను ప్రజలకు అందించే బాధ్యత నుండి ప్రభుత్వం క్రమక్రమంగా తప్పుకుంటోందని విమర్శించారు. సిడిఎస్‌ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ నగదు బదిలీ పధకం పేదల వ్యతిరేక నిర్ణయమని అన్నారు. సిపిఐ ఎంఎల్‌-న్యూ డెమోక్రసీ నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా పధకాలకు, సబ్సిడీలకు కోతలు విధించటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయిబాబు, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ పి జమలయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment