తెలుగమ్మాయికి ప్రెసిడెన్షియల్ అవార్డు
మరో ముగ్గురు భారతీయులకు కూడా...అమెరికా అధ్యక్షుడు ఒబామా చేతుల మీదుగా అత్యున్నత పురస్కారం
వాషింగ్టన్ : నలుగురు భారతీయ అమెరికన్ యువ శాస్త్రవేత్తలను దేశ అత్యున్నత పురస్కారం ‘యూఎస్ ప్రెసిడెన్షియల్’ అవార్డు వరించింది. శ్రీదేవి వేదుల శర్మ, పవన్ సిన్హా, పరాగ్ ఏ పాఠక్, బిజు పరెక్కదాన్‌లను దాదాపు 96 మంది పరిశోధకుల జాబితా నుంచి ఎంపిక చేయడం విశేషం. 1996లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కోసం ప్రపంచ వ్యాప్తంగా యువ శాస్త్రవేత్తలు భారీగా పోటీ పడుతుండడం గమనార్హం. ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక రంగాల్లో వ్యక్తిగతంగా చేస్తున్న కృషి, సాధించిన విజయాల మదింపు ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు అవార్డు కార్యక్రమ వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అధ్యక్షుడు ఒబామాయే స్వయంగా ప్రకటించారు.
శ్వేతసౌధంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమానికి విభిన్న రంగాల్లో తలపండిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ, ‘‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న నూతన ఆవిష్కరణలు మన ఆర్థిక వ్యవస్థను బలోన్నతం చేయడమే కాకుండా మనలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేస్తున్నాయి’’ అని శ్లాఘించారు. అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న శాస్త్రవేత్తలు వారు ఎంచుకున్న రంగాల్లో మరింత పురోభివృద్ధి సాధించి, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు నాంది పలకగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు.
వారికి వారే సాటి!
శ్రీదేవి వేదుల శర్మ: శ్రీదేవి మన రాష్ట్రానికి చెందిన వేదుల వై శర్మ, క్రిష్ణవేణి దంపతుల కుమార్తె. 1966లోనే అమెరికాకు వలస వెళ్ళిన శర్మ, విశాఖపట్నం(వాల్తేరు) ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. 1966లో అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్‌లోని ఫెడరల్ ఎనర్జీ రిజర్వ్ కమిషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, శ్రీదేవి తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే కావడం గమనార్హం. ఈవిడ మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కి చెందినవారు. ప్రస్తుతం ఆవిడ అమెరికా ప్రభుత్వ జియోలాజికల్ సర్వే డిపార్టుమెంట్‌లో కంప్యూటర్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు అమెరికాలో భారతీయ శాకాహార హోటల్‌ను విజయవంతంగా నిర్వహిస్తుండడం గమనార్హం.
ప్రెసిడెన్షియల్ అవార్డు పొందిన శ్రీదేవి, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ కంప్యుటేషనల్ మెడిసిన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
1994లో కొర్నెల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ పట్టా పొందారు.
1997-2006 మధ్య ప్రఖ్యాత మస్సాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ల్లో ఎం.ఎస్., పీహెచ్‌డీ చేశారు.
2006-2009 మధ్య ఆమె మస్సాచ్యుసెట్స్‌లోని బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా కొనసాగారు.
పవన్ సిన్హా: ఐఐటీ న్యూఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పట్టా సొంతం చేసుకున్న సిన్హా, మస్సాచ్యుసెట్స్ నుంచి మాస్టర్, డాక్టోరల్ డిగ్రీలు సాధించారు.
మస్సాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో కంప్యుటేషనల్ అండ్ విజువల్ న్యూరోసైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
పుట్టుకతోనే అంధత్వం సంక్రమించిన బాలలకు కంటి చూపు ప్రసాదించేందుకు సిన్హా అనేకానేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యంగా భారత దేశంలోని అంధ బాలలకు కంటి చూపు తెప్పించడం కోసం అహరహం శ్రమించారు.
ఈ ప్రయోగాల సమాహారంతోనే ‘ప్రాజెక్ట్ ప్రకాష్’ను వెలువరించారు. ఫలితంగా బాలలలో అంధత్వాన్ని తగ్గించేందుకు బాటలు పరిచారు.
బిజు పరెక్కదాన్:మస్సాచ్యుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన వారుకావడం గమనార్హం.
పరాగ్ ఏ పాఠక్: మస్సాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు.
No comments:
Post a Comment