టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…
బ్రెజిల్ లో 1964 నుండి 1985 వరకూ నియంతృత్వ పాలన సాగింది. ఆనాటి నియంతృత్వ పాలన ఛాయలు, విరోధాలు ఇప్పటికీ బ్రెజిల్ లో వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. నియంతృత్వ పాలకులు ప్రజలపై సాగించిన దురన్యాయాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ట్రూత్ కమిషన్ నియమించింది. ట్రూత్ కమిషన్ విచారణ వల్ల అప్పటి అణచివేతలు, చిత్రహింసల కధలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గుండెల్ని వణికించే ఆనాటి భయానక హింసల వివరాలు బ్రెజిల్ ప్రజల్లో కొంతమందికి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుండగా, అనేకమందికి వారెరుగని చీకటి చరిత్రను విప్పి చూపుతున్నాయి.
చిత్రహింసల కొలిమి
అర్బన్ గెరిల్లా గ్రూపులో సభ్యురాలయిన దిల్మా 1970 లో నియంతృత్వ పాలకులకు పట్టుబడింది. పట్టుబడే నాటికి ఆమె వయసు 22 సంవత్సరాలే. 3 సంవత్సరాల పాటు ఆమె జైలులో అనుభవించిన చిత్ర హింసల విషయం ఇప్పుడు ప్రముఖంగా చర్చించబడుతోంది. ఆమెను ఇంటరాగేట్ చేసిన వారు ఆమెను పదే పదే ఎలక్ట్రిక్ షాక్ లకు గురి చేశారనీ, కాళ్ళకూ, చెవులకూ వైర్లు తగిలించి షాక్ ఇచ్చేవారనీ, పూర్తి నగ్నం కావించి కాళ్ళూ చేతులూ కట్టేసి ఒక కర్రకు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేసేవారనీ తమకు అందిన సమాచారం ఆధారంగా పత్రికలు వెల్లడిస్తున్నాయి.
ఇంటరాగేషన్ లో దిల్మా ను హింసించినవారిలో 76 సంవత్సరాల మారిషియో లోపేస్ లీమా ఒకరు. అప్పటి మిలట్రీలో లెఫ్టినెంట్ కల్నల్ గా చేసిన లోపేస్, తనపై ఆరోపణలు నిజం కాదని చెబుతున్నప్పటికీ దిల్మా ను ‘మంచి గెరిల్లా’ గా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. లోపేస్ లాంటి అనేకమంది మాజీ మిలట్రీ పాలకులను బ్రెజిల్ లోని హక్కుల సంఘాలు ఇతర ప్రజా సంఘాలు వెంటాడుతున్నాయి. బ్రెజిల్ వ్యాపితంగా అనేక నగరాలలోని వారి ఇళ్లను చుట్టుముడుతున్నారు. 1979 లో నియంతృత్వ ప్రభుత్వం ప్రకటించిన ‘క్షమాభిక్ష’ మాజీ మిలట్రీ అధికారులను ‘టార్చర్’ ఆరోపణలనుండి ఇప్పటికీ రక్షణ కల్పిస్తోంది. అయినప్పటికీ గత మే నెలలో మొదలయిన ట్రూత్ కమిషన్ చీకటి చరిత్రను తవ్వితీస్తుండడంతో వారిని గతం వెన్నాడుతోంది. 400 మందికి పైగా ప్రజలను చంపిన బ్రెజిల్ నియంతృత్వ పాలకులు అనేకవేలమందిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నియంతృత్వాలకు వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా పోరాటాలు నడిపి అనంతరం రాజకీయ నాయకులుగా దేశాలను ఏలుతున్నవారిలో దిల్మా రౌసెఫ్ ఒంటరి కాదు. అమెరికా మద్దతుతో లాటిన్ అమెరికా దేశాలను ఏలిన అనేకమంది నియంతలు దేశ వనరులను అమెరికాకి అప్పజెప్పి ప్రజలను తమ హింసాత్మక పాలనలో అణచివేశారు. సదరు నియంతలకు ఎదురోడ్డి పోరాడిన వారు ఇతర దేశాల్లోనూ అధికారాన్ని చేపట్టారు. చిలీ మాజీ అధ్యక్షుడు మిచెల్లే బాచెలెట్ వారిలో ఒకరు. 1973 మిలట్రీ కుట్రతో అధికారం లాక్కున్న పినోచెట్ పాలనలో దారుణమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్న బాచెలెట్ అనంతరం చిలీ అధ్యక్షుడు అయ్యాడు. ఉరుగ్వే అధ్యక్షుడు జోస్ ముజికా సైతం ‘తుపమారో గెరిల్లా ఆర్గనైజేషన్’ నాయకుడుగా అరెస్టయ్యి 14 సంవత్సరాల కారాగారంలో తీవ్ర హింసను అనుభవించాడు.
తన నిర్బంధ జీవితంపై దిల్మా ఇంతవరకూ మౌనాన్ని వీడలేదు. నియంతృత్వ బాధితురాలుగా గుర్తింపబడడానికి నిరాకరించడమే ఆమె మౌనానికి అర్ధం కావచ్చు. కానీ నియంత్రత్వం నీడలో సాగిన చీకటి చర్యలను వెలికితీయడానికి కృషిని ఆమె ప్రభుత్వం కొనసాగిస్తోంది. ది హిందూ కధనం ప్రకారం బహిరంగంగా ఆమె ఎన్నడూ తనపై సాగిన క్రూర నిర్బంధకాండను ప్రస్తావించలేదు. ట్రూత్ కమిషన్ గురించి మాట్లాడింది కూడా తక్కువే. కమిషన్ పై గానీ, తన జైలు జీవితం పైగానీ స్పందించడానికి ఆమె నిరాకరించినట్లు ‘న్యూయార్క్స్ టైమ్స్’ తెలిపింది. బల్గేరియన్ వ్యాపారికీ, బ్రెజిలియన్ స్కూల్ టీచర్ కీ జన్మించిన దిల్మా ఆర్ధికంగా ఒకింత ఉన్నత స్ధితిలోనే పరిగినప్పటికీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ‘పల్మారెస్ ఆర్మ్ డ్ రివల్యూషనరీ వేన్ గార్డ్’ లో చేరి ఉద్యమంలోకి దూకింది.
మంచి గెరిల్లా
జైలు నుండి విడుదలయ్యాక పోర్టో అలెగ్రే నగరంలో ఆమె తిరిగి చదువు ప్రారంభించింది. 1976 లో కూతురు పుట్టాక స్ధానిక రాజకీయాల్లో ప్రవేశించింది. టెక్నోక్రాట్ గా ఎదుగుతూ జాతీయ ప్రాముఖ్యం సంపాదించింది. మాజీ అధ్యక్షుడు లూలా డి సిల్వా కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, విద్యుత్ మంత్రిగా పని చేసి తన గురువు ప్రాపకంలో దేశాధ్యక్ష పదవిని అలంకరించింది. 2010 ఎన్నికల్లో లూలా పార్టీ తిరిగి ఎన్నిక కావాడానికి దిల్మా పైనే ఆయన ప్రధానంగా ఆధారపడ్డాడని చెబుతారు. టార్చర్ చాంబర్లలో దిల్మా అనుభవించిన చిత్రహింసల చరిత్ర ఈ కాలం అంతటా మరుగునే ఉండిపోయింది. నియంతృత్వాన్ని ఎదిరించిన మహిళల గురించి ఒక రచయిత పుస్తకం రాస్తున్న సందర్భంగా దిల్మా కొద్ది వివరాలను ఆ రచయితకు చెప్పడంతో 2005 లో కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.
దిల్మా రౌసెఫ్ ను ‘మంచి గెరిల్లా’ గా చెబుతూనే ఆమెను హింసించిన విషయాన్ని లిమా లోపేస్ నిరాకరిస్తున్నాడు. ఇతర మాజీ మిలట్రీ పాలకులు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. బ్రెజిల్ ఆర్మీ కి సెక్రటరీ జనరల్ గా పని చేసిన ‘ఎడ్వర్డో రోచా పైవా’ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దిల్మా విషయాన్ని ప్రస్తావించాడు. దిల్మా సాయుధ మిలిటెంటు గ్రూపులో పని చేసిందని, సోవియట్ తరహా నియంతృత్వాన్ని స్ధాపించాలని ఆ గ్రూపు కోరుకుందనీ చెప్పాడు. తిరుగుబాటుదారులు కూడా చిత్రహింసాలకు పాల్పడ్డారని వాదించాడు. “మిలట్రీ హయాంలో టార్చర్ జరిగిందా? అవును. బ్రెజిల్ లో ఈరోజు టార్చర్ ఉన్నదా? ఉంది” అని ఆయన వ్యాఖ్యానించాడు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలకు తానెప్పుడూ పాల్పడలేదని దిల్మా చెప్పినా మాజీ మిలట్రీ అధికారుల వ్యాఖ్యలను ఖండించడానికి ఆమె ప్రయత్నించలేదు. అంతేకాక టార్చర్ బాధితులకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం అందుకున్నవారిలో దిల్మా కూడా ఒకరు. ‘టార్చర్ నెవర్ ఎగెయిన్’ (టి.ఎన్.ఎ) అనే సంస్ధకు తనకు వచ్చిన 10,000 డాలర్లను ఇస్తానని ఆమె ప్రకటించింది కూడా. మిలట్రీ హింసలకు వ్యతిరేకంగా చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఏర్పరిచిన టి.ఎన్.ఎ కార్యాలయం ఇటీవల విధ్వంసానికి గురవడాన్ని బట్టి మాజీ మిలట్రీ నియంతల ప్రాపకంలో ఎదిగిన ధనికవర్గాల శక్తి తగ్గిపోలేదని అర్ధం చేసుకోవచ్చు.
ఎన్నికల ఉపన్యాసాల్లో గానీ, ప్రభుత్వ మీటింగుల్లో గానీ, వ్యక్తిగత సంభాషణల్లోగానీ ఏనాడూ తాను ఎదుర్కొన్న హింసను ప్రస్తావించని దిల్మా రౌసెఫ్ అంతరంగం కొన్ని పశ్చిమ పత్రికలకు కొరుకుడు పడని విషయం. కాగా, తమ హయాంలో చిత్రహింసలు నిజమేననీ, (ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న) ఇప్పటి హయాంలోనూ చిత్ర హింసలు నిజమేననీ నియంతృత్వ పాలన నాటి సైన్యాధికారులు ముక్తాయించడం దీనంతటికీ కొసమెరుపు. దేశ వనరులను దోచుకోవడానికి పాలకవర్గాలలో ఒకే గ్రూపు చేసే ప్రయత్నాలు నియంతృత్వం రూపం ధరిస్తే, ఇతర గ్రూపులకు కూడా దోచుకునే అవకాశం కల్పించడం ప్రజాస్వామ్యంగా చెప్పబడుతుందని బ్రెజిల్ నియంతృత్వ సైన్యాధికారుల ముక్తాయింపు విప్పి చెబుతున్న సత్యం. యుక్త వయస్సులో ప్రజలకోసం బతికినప్పటికీ అనంతరం దోపిడీ వ్యవస్ధలోనే టెక్నోక్రాట్ గా, రాజకీయవేత్తగా, దేశాధ్యక్షురాలిగా ఎదగడం ద్వారా దిల్మా రౌసెఫ్ తాను ప్రజల పక్షం నుండి పాలకవర్గాల పక్షం చేరిపోయాయని స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడామె ‘మంచి గెరిల్లా’ గా మాజీ నియంతృత్వ ప్రభువుల చేత మన్ననలు అందుకుంటోంది.
No comments:
Post a Comment